ఆలియా భర్త రణ్బీర్ కపూర్‌కి ఇండస్ట్రీలో దశాబ్దంన్నర అనుభవం ఉంది. ఈ పదిహేనేళ్లలో ఆయన అపజయాల కన్నా జయాలే ఎక్కువ చూశారు. 2007లో సావరియాతో యాక్టర్‌గా బాలీవుడ్‌కి పరిచయమయ్యారు రణ్‌బీర్ కపూర్. `బచ్నా ఏ హసీనో`, `వేక్ అప్ సిద్`, `రాక్‌స్టార్`, `బర్ఫి`, `ఏ జవానీ హై దివానీ`, `ఏ దిల్ హై ముష్కిల్`, `బ్రహ్మాస్త్ర పార్ట్ ఒన్ శివ`, `తూ జూఠీ మే మక్కర్` వంటి సినిమాలతో హై మీదున్నారు రణ్బీర్ కపూర్.
తన జీవితంలో తానెప్పుడు తొలి సారి స్టార్‌గా ఫీలయ్యారోననే విషయాన్ని రణ్‌బీర్ కపూర్‌ని అడిగితే ``నా తొలి సినిమా చాలా పెద్ద డిజాస్టర్ అయింది. అయితే, ఆ వైఫల్యం నా మనసును తాకలేదు. ఎందుకంటే ఆర్టిస్టుగా ఫ్లాపులను, సక్సెస్‌లను చూడాల్సిందేనని ఫిక్సయ్యాను. అది నాలో మంచి కాన్ఫిడెన్స్ నింపింది. నేనెప్పుడూ ఎవరినీ కాంపిటిషన్‌గా భావించలేదు. ఎవరికన్నా గొప్పగానో, తక్కువగానో కూడా భావించలేదు. నేను నాదైన రేస్‌లో పరుగులు తీస్తున్నట్టే అనుకున్నాను. నా జీవితంలో నేనేం చేయాలనుకుంటున్నాననే దాని మీద నాకు స్పష్టమైన అవగాహన ఉంది. నేను ఏ తరహా సినిమాలు చేయాలనుకుంటున్నానో నాకు చాలా బాగా తెలుసు. నేను ఎలాంటి పాత్రల్లో నటించాలనుకుంటున్నాననే దాని మీద అవగాహన ఉంది. నా ఇష్టాయిష్టాల వల్ల నేను భవిష్యత్తులో ఫెయిల్యూర్స్ కూడా చూడొచ్చు. నా విజయాల కన్నా, నా ఫెయిల్యూర్లే నాకు చాలా ఎక్కువ నేర్పించాయి`` అని అన్నారు.
సక్సెస్ గురించి మాట్లాడుతూ ``ఎప్పుడైనా మన సినిమాలు సక్సెస్ అయితే హమ్మయ్యా... సక్సెస్ వచ్చింది అని నెక్స్ట్ సినిమా విడుదలయ్యే వరకు మాత్రం ఓ రిలీఫ్ ఉంటుంది. అదే ఫెయిల్యూర్ వస్తే, చాలా విషయాలను అర్థం చేసుకుంటాం. నేను 15 ఏళ్ల అద్భుతమైన కెరీర్ చూశాను. నా దృష్టిలో నేను చాలా బెస్ట్. అలాగని దాన్నేదో పండగలా చేసుకోవాలనుకోవడం లేదు. కానీ, నేను బెస్ట్ అన్న సంగతిని నాకు నేను చెప్పుకుంటే, ఇంకా ముందుకు సాగగలుగుతాను`` అని అన్నారు. సంజయ్ లీలా భన్సాలీ సినిమా బ్లాక్‌కి అసిస్టెంట్ డైరక్టర్‌గా పనిచేసిన అనుభవం ఉంది రణ్బీర్ కపూర్‌కి.